

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలంగా కేటీఆర్‌పై విమర్శలు చేసిన ఆమె, ఇప్పుడు ఆయనకు స్పష్టంగా మద్దతు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు.
హైదరాబాద్ ఫార్ములా రేస్ నిధుల దుర్వినియోగ ఆరోపణల కేసులో కేటీఆర్‌ను కూడా విచారణకు పిలవడానికి అనుమతి లభించడంతో, ఏసీబీ అవసరమైతే అరెస్టు చేసే అవకాశమూ ఏర్పడింది. ఈ పరిణామాన్ని కవిత రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, బీజేపీ సూచించినట్లే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రత్యర్థులపై కేసులు పెట్టడం రెండు పార్టీలకూ అలవాటైందని ఆమె విమర్శించారు.
కవిత మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బస్తీల్లో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం కూడా అధికార నేతలకు లేదని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేటీఆర్‌పై విచారణ డ్రామా సృష్టించారని కవిత అభిప్రాయపడ్డారు.
అయితే, ఆమె అకస్మాత్తుగా అన్నకు సపోర్టు ఇవ్వడం వెనుక అసలు రాజకీయ సందేశమేంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఇటీవల వరకూ విమర్శలు చేసిన కవిత ఇప్పుడు ఒకే కుటుంబంగా నిలిచే వ్యూహం తీసుకున్నారా? లేక బయటి శక్తుల దాడి అని భావించి కుటుంబంగా ఏకం కావాలనుకుంటున్నారా? అన్నది రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!