

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి ఖమ్మంలో ప్రారంభమైన ఆమె దీక్షను పోలీసులు మంగళవారం ఉదయం అడ్డుకుని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయానికి తరలించారు. అనంతరం బంజారాహిల్స్‌లోని కార్యాలయంలోనే ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్లలో కూల్చివేసిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిందేనన్నారు. అప్పటి వరకు తన నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, భూముల ధరలు పెరగడంతో పేదల ఇళ్లను కూల్చి ఆ స్థలాలను పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు మరియు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!