

తమిళనాడు కరూర్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఘోర తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. వందలాది మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.
చీఫ్ మినిస్టర్ స్టాలిన్ వెంటనే స్పందించి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. అరుణ్ ఆదివారం తెల్లవారు జామునే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్లపై వేలాది చెప్పులు, నీటి బాటిళ్లు, ప్యాకెట్లు పడివుండటం ఈ ఘటన భయానకతను స్పష్టంగా చూపించింది.
ఉదయం 10 గంటలకు –
టీవీకే పార్టీ కరూర్‌లోని వేలుసామిపురంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. పార్టీ అధినేత విజయ్ ప్రసంగం కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు.
ఉదయం 11 గంటలకు –
సభ ఉదయం 11 గంటలకు జరుగుతుందని ముందుగా ప్రకటించారు. కానీ, చివరికి వాయిదా వేసి సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలియజేయలేదు. ఫలితంగా వేలాది మంది అక్కడే వేచి చూశారు.
మధ్యాహ్నం 3 గంటలకు –
ఇంకా ఎక్కువ మంది అభిమానులు, స్థానిక ప్రజలు చేరుకున్నారు. జనసమ్మర్థం వేగంగా పెరుగుతోంది.
సాయంత్రం 4 గంటలకు –
పార్టీ అంచనా వేసింది 50 వేల మంది వస్తారని. కానీ, అప్పటికే 5 లక్షల మందికి పైగా సమీకరమయ్యారు. రోడ్లు, మైదానాలు అన్నీ జనంతో కిటకిటలాడాయి.
సాయంత్రం 6 గంటలకు –
ఎటు చూసినా జనమే. జనసంద్రం కారణంగా రహదారులు కనపడని పరిస్థితి ఏర్పడింది. ముందస్తు అంచనాలు, సమన్వయం లేకపోవడం పెద్ద తప్పిదమైంది.
సాయంత్రం 7 గంటలకు –
విజయ్ కాన్వాయ్ వస్తోందని సమాచారం చేరగానే, ప్రజలు మరింత ఉత్సాహంతో ముందుకు దూసుకొచ్చారు. బహిరంగ వేదిక వద్దకు ఆయన చేరుకోలేకపోయారు. అందువల్ల బస్సు పైకెక్కి ప్రసంగం ప్రారంభించారు.
సాయంత్రం 7:20 గంటలకు –
ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. “ఈ సారి మనదే రాజ్యం… కరూర్‌కు అన్యాయం జరుగుతోంది” అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడారు. దీంతో అభిమానులు మరింత ఉత్సాహానికి లోనయ్యారు.
సాయంత్రం 7:30 గంటలకు –
“మీ హీరోని సీఎం చేయాలనుకుంటున్నారా?” అని విజయ్ అడగగానే, జనసంద్రం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది.
సాయంత్రం 7:40 గంటలకు –
అధిక జనసమ్మర్థం కారణంగా తోపులాటలు మొదలయ్యాయి. ఒక మహిళ నేలపై పడిపోయారన్న సమాచారం విజయ్‌కి అందింది. వెంటనే ఆయన ప్రజలను ఆపాలని కోరినా, అప్పటికే పరిస్థితి అదుపుతప్పిపోయింది. ప్రజలు ఒక్కరిపై ఒకరు పడిపోవడంతో ఘోర తొక్కిసలాట జరిగింది. 40 మంది అక్కడికక్కడే మృతి చెందగా, వందలాది మందికి పైగా గాయపడ్డారు.
రాత్రి 9:30 గంటలకు –
ఈ సంఘటన వార్త దేశవ్యాప్తంగా పాకింది. సీఎం స్టాలిన్ వెంటనే స్పందించి, విచారణ కమిటీని ప్రకటించారు.
ఈ విషాదం వెనుక ప్రధాన కారణం – అధిక జనసమ్మర్థం, నిర్వాహకుల అంచనాలు తప్పిపోవడం, సమన్వయం లోపించడం, అలాగే ప్రసంగంలో వచ్చిన భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!