

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మంగళవారం మైసూరు విమానాశ్రయంలో జరిగిన పరిణామాలు మరింత బలం చేకూర్చాయి. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఢిల్లీ వెళ్లే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను వేర్వేరుగా, కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాహుల్ గాంధీతో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ మీడియా సృష్టేనని ఆయన కొట్టిపారేశారు. అయితే, డీకే శివకుమార్ కార్యాలయం మాత్రం రాహుల్ గాంధీతో చర్చలు జరిగినట్లు ప్రకటన విడుదల చేసింది. గతంలో సీఎం పదవిని పంచుకునే ఒప్పందం జరిగినట్లు ప్రచారం ఉండటంతో పాటు, ఈ భేటీ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనగా, అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి పెరిగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!