

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కారణంగా హైదరాబాద్ నగరంలో నాలుగు రోజుల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 12 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజు కూడా అన్ని వైన్ షాపులు, బార్లు, క్లబ్‌లు, స్టార్ హోటల్స్‌లోని లిక్కర్ కౌంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైతే రీపోల్ రోజు కూడా ఇదే నిబంధనలు కొనసాగనున్నాయి.
ఈ ఆదేశాలు ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 20, అలాగే ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 135-C ప్రకారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ జారీ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఈసారి భారీ హోరాహోరీగా మారింది. ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు — ఇది నియోజకవర్గ చరిత్రలోనే రికార్డు. 2009 నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో పోటీదారులు ఉండడం ఇదే తొలిసారి. ఈసారి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచి తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలనుకుంటుండగా, బీఆర్ఎస్ పార్టీ తమ పాత బలాన్ని తిరిగి సాధించాలనే సంకల్పంతో ఉంది. మరోవైపు బీజేపీ ఈ బైపోల్లో విజయం సాధించి, నగరంలో తన పట్టు మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
ఎన్నికల వేడిలో మద్యం దుకాణాలు మూతపడడం మద్యం ప్రియులకు నిరాశ కలిగించే వార్తగా మారింది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
Very informative