

రాష్ట్రంలో మహిళలకు అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డులను త్వరగా సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఆదేశించింది. జూన్ 2 వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. 2026 - 27 రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఉపముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర అధికారులు సమావేశానికి హాజరయ్యారు. బడ్జెట్ లో ఆర్టీసీకి నిధుల కేటాయింపు ప్రతిపాదనలను ఎండీ నాగిరెడ్డి వివరించారు.
మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్ కార్డులు అందించాలని భట్టి విక్రమార్క ఆదేశించినట్లు తెలిసింది. మూడు రకాల స్మార్ట్ కార్డులను డిప్యూటీ సీఎం మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎండీ చూపించినట్లు సమాచారం. తొలుత ప్రతి జిల్లాలో ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డు నమూనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చూపించాలని నిర్ణయించారు. పైలట్ దశలో సుమారు ఐదు లక్షల మందికి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. చిప్ తో కూడిన ఈ కార్డుల తయారీకి సుమారు రూ.75 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులను ఆర్థిక సహాయం రూపంలో మంజూరు చేయాలని ఆర్టీసీ ప్రభుత్వం ను కోరింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!