

కృష్ణా నదీ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై తెలంగాణ శాసనసభలో జరిగిన ‘నీళ్లు–నిజాలు’ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా (పాలమూరు)కు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. కరువు, పేదరికాన్ని స్వయంగా చూసిన వ్యక్తిగా నీటి వ్యవహారాల్లో నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ చర్చను తెరపైకి తెచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు గైర్హాజరు కావడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని భావించామని, కానీ ప్రజలకంటే పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. బహిరంగ సభల్లో మాట్లాడే మాటల కంటే చట్టసభల్లో మాట్లాడే మాటలకే విలువ ఉంటుందని, సభకు రాకపోవడం బీఆర్ఎస్ చట్టసభల పట్ల ఉన్న దృక్పథాన్ని చూపుతోందన్నారు.
కృష్ణా ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేసీఆర్ను నేరుగా ప్రశ్నించాలనుకున్నామని రేవంత్ తెలిపారు. 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఈ అంశంలో ఎవరి బాధ్యత ఏమిటన్నది ప్రజల ముందు ఉంచాలనుకున్నామని, అవసరమైతే నిజనిర్ధారణ కమిటీ వేయాలని కూడా వ్యాఖ్యానించారు. చివరికి నిజం ఏంటన్నది ప్రజలే తేల్చుకుంటారని సీఎం అన్నారు.









.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!