

తెలంగాణలో రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 17ను తక్షణమే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంపై స్పష్టత ఇవ్వకుండా కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
జీవో ప్రకారం వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, మిషన్ భగీరథకు సంబంధించిన కనెక్షన్లను కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావడంపై హరీశ్ రావు పలు సందేహాలు వ్యక్తం చేశారు. పరిమిత సిబ్బందితో భారీ విద్యుత్ వ్యవస్థను ఎలా నిర్వహిస్తారని, విద్యుత్ కేటాయింపులు, అప్పులు, నిర్వహణ ఖర్చులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదిలీ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని, లేనిపక్షంలో రైతు డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ తరఫున కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!