

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో అన్నదాతలను పట్టించుకోలేదని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. జగన్ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చైర్మన్గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్గా బిట్రగుంట మల్లిక ప్రమాణ స్వీకారం చేయగా, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు మిర్చి యార్డ్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మార్కెట్ ఇదేనని పేర్కొన్నారు. మిర్చి రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడాలంటే పురుగు మందుల వాడకం తగ్గించి నాణ్యమైన దిగుబడిపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. సిటీ మధ్యలో ఉన్న యార్డ్ మార్పుపై నివేదిక ఇస్తే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!