

మొంథా తుఫాను రాష్ట్రంపై తీవ్రమైన ప్రభావం చూపి అంచనాలను మించి భారీ నష్టం కలిగించింది. ఈ విపత్తుతో కలిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం సానుభూతితో పరిగణించి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తుఫాను కారణంగా మొత్తం రూ.6,384 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రాష్ట్ర అధికారులు వివరించారు. తక్షణ సహాయంగా రూ.901.4 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం రాష్ట్ర పర్యటనను ప్రారంభించింది.
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు, వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం సోమవారం అమరావతిలోని సచివాలయం చేరుకుంది. అక్కడ ఆర్టీజీఎస్ అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తుఫాను ప్రభావం, నష్టం వివరాలను బృందానికి వివరించారు. మొంథా తుఫాను రాష్ట్రంలోని 24 జిల్లాలను ప్రభావితం చేసినట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం వలన ప్రాణనష్టం తక్కువగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. తుఫాను తర్వాత సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగించామని తెలిపారు.
గత బుడమేరూ వర్షాల అనుభవంతో ఈసారి సహాయక చర్యల కోసం 680 డ్రోన్లు వినియోగించినట్లు వివరించారు. అక్టోబర్ 27 నుంచి 29 వరకు 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణ వర్షపాతం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ అని చెప్పారు.
ఈ తుఫాను ప్రభావం 443 మండలాల్లో కనిపించిందని, మూడు మంది ప్రాణాలు కోల్పోయారని, 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1,11,402 మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో 12 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 1,702 వాహనాలు, 110 మంది ఈతగాళ్లు పాల్గొన్నారని చెప్పారు.
అలాగే 22 జిల్లాల్లో 2,471 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 1,92,441 మందికి పునరావాసం కల్పించినట్లు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!