

తన పిల్లలకు వారసత్వంగా రాజకీయాలు కాకుండా స్వర్ణభారత్ ట్రస్ట్ మాత్రమే ఇస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఎప్పటికీ ఇష్టం లేదన్నారు. అందుకే తన కుమారుడు, కుమార్తెను రాజకీయాల్లోకి రానివ్వలేదని స్పష్టంగా తెలిపారు. తన పిల్లలకు తాను ఇచ్చే నిజమైన సంపద సంస్కృతి, సంప్రదాయాలు, విలువలేనని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
కాలం మారినా, పరిస్థితులు మారినా మన మూలాలు మాత్రం మారకూడదన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం స్వర్ణభారత్ ట్రస్ట్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సంక్రాంతి పండగ వ్యవసాయంతో, ప్రకృతితో ముడిపడి ఉందని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరే సమయంలోనే ఈ పండగను జరుపుకుంటామని చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రకృతి బాగుంటేనే భవిష్యత్ కూడా బాగుంటుందని, అందుకే ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!