

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆలోచనల్లోనూ, హృదయంలోనూ తెలంగాణకు స్థానం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ ఇచ్చిన భిక్ష కాదని, ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితమని స్పష్టం చేశారు. ఉద్యమ తీవ్రత పెరిగి, రాజకీయంగా కొట్టుకుపోతామనే భయంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ కోణంలోనే చూసిందని, ఆ పార్టీ రాష్ట్ర ఉద్యమ చరిత్రను ఎప్పటికీ చెరిపివేయలేదని అన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రణాళికలపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. మూసీలో 10 టీఎంసీల నీరు పోస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఆ నీటిని హైదరాబాద్ ప్రజలకు అందించవచ్చుకదా అని ప్రశ్నించారు. కరవు పరిస్థితుల్లో మూసీ సుందరీకరణ అవసరమా అని నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు మర్చిపోయారని, చివరి వంద రోజుల్లో హడావుడి చేస్తే సరిపోతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. డీపీఆర్‌లు వెనక్కి రావడమే ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడేళ్లలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ సాధించిందని విమర్శించారు. అసెంబ్లీలో తనపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి రెండు నెలలు గడిచినా, తాను కోరిన 8 వేల ఎకరాలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ విస్తీర్ణం వెయ్యి ఎకరాలని గతంలో చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి, చివరకు అది 67 ఎకరాలేనని అంగీకరించారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే ప్రథమ విలన్, ప్రధాన శత్రువని కేటీఆర్ విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!