

కూటమి పార్టీల మధ్య మిత్రధర్మం విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి చోటా కూటమి విజయం సాధించేలా పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం తెదేపా నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో స్థానిక ఎన్నికల సన్నద్ధత, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘చెప్పాం–చేస్తున్నాం’ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. కూటమి పార్టీల కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పొత్తులు, రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాల కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పదవుల ద్వారా గుర్తింపు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఓటరూ పోలింగ్ బూత్‌కు చేరుకుని ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రతి బూత్‌లోనూ అధిక ఓట్లు సాధించే దిశగా పనిచేయాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!