

బెంగళూరులోని యలహంక భూమి యాజమాన్యంపై నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఈ ఏడాది మార్చి 20న విడుదల చేసిన బహిరంగ ప్రకటన తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన కుమార్తె వైఎస్ షర్మిలకు కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిచ్చిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)లో పేర్కొన్న ఆస్తులతో పాటు, అందులో ప్రస్తావించని యలహంక భూమి, సరస్వతి సిమెంట్ ఆస్తులు కూడా షర్మిలకు చెందుతాయని విజయమ్మ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనను న్యాయవాదితో నోటరీ చేయించిన అనంతరం విడుదల చేసినట్లు సమాచారం. షర్మిల తన కుమార్తె అంజిలి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని నిర్ణయించుకోవడం, అక్కడ పెళ్లి నిర్వహణపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడంతో పాత ప్రకటన మళ్లీ తెరపైకి వచ్చింది.
తాజాగా షర్మిలకు జగన్ రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖలో, తాను నివసిస్తున్న ప్రాంగణంలో వివాహం నిర్వహిస్తే భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయమ్మ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించే సమయానికి ఉన్న ఆస్తుల పంపకం పూర్తికాలేదని, కుటుంబ ఆస్తులను నలుగురు మనవలకు సమానంగా పంచాలన్నది ఆయన ఉద్దేశమని విజయమ్మ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఎంవోయూలో షర్మిలకు కేటాయించిన ఆస్తులు ఆమెకు న్యాయంగా చెందాల్సినవేనని, వాస్తవానికి ఆమెకు దక్కాల్సిన వాటా కంటే తక్కువే ఇచ్చారని ఆరోపించారు. తన మేనల్లుడు, మేనకోడలికి న్యాయం చేయాలని జగన్‌ను కోరుతూ, కుటుంబ ఆస్తుల విషయంలో వాస్తవాలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, యలహంక భూమి యాజమాన్యం, ఆస్తుల పంపకంపై సంబంధిత పక్షాల వాదనలు, చట్టపరమైన ఆధారాల ఆధారంగానే తుది స్పష్టత రావాల్సి ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!