

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరంతో బాధపడినప్పటికీ, మందులు, పెయిన్‌కిల్లర్స్ తీసుకుని మైదానంలోకి దిగింది. భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో మూడో ఓవర్‌లోనే క్రీజ్‌లోకి వచ్చిన హర్మన్‌ప్రీత్.. దాదాపు 43 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి 121 బంతుల్లో 126 పరుగులు చేసింది. తన శతకాన్ని ఎంతో ఆస్వాదించానని, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆటపైనే దృష్టి పెట్టానని ఆమె తెలిపింది. వన్డేల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆడటం ముఖ్యమని, మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను శిక్షించాలనే వ్యూహంతో ముందుకెళ్లామని వెల్లడించింది.
మ్యాచ్‌కు ముందు జ్వరం రావడంతో ఫీల్డింగ్ సమయంలో ఇబ్బంది పడ్డానని హర్మన్‌ప్రీత్ చెప్పింది. అయినప్పటికీ, మందులు తీసుకుని ఆటను కొనసాగించినట్లు వివరించింది. భారత కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. జట్టు విజయంలో హర్మన్‌ప్రీత్‌తో పాటు ప్రతీకా రావల్, దీప్తి శర్మ కీలక పాత్ర పోషించారని ప్రశంసించింది. ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టి, ప్రతీకా, దీప్తితో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిందని పేర్కొంది. సాధారణంగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే దీప్తి శర్మకు ఈసారి ఎక్కువసేపు ఆడే అవకాశం లభించిందని, ఆమె దాన్ని చక్కగా వినియోగించుకుందని స్మృతి తెలిపింది. భారత బౌలర్లు కూడా జింబాబ్వే బ్యాటర్లను సమర్థంగా కట్టడి చేశారని పేర్కొంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మృతికి ఇదే తొలి వన్డే సిరీస్ కావడం విశేషం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!