
నిజామాబాద్‌లోని హరిచరణ్ మార్వాడీ పాఠశాల పోలింగ్ కేంద్రం (బూత్ నెం. 287) వద్ద చోటుచేసుకున్న ఘటనలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కేంద్రంలోకి నిషేధిత స్టిల్ మరియు వీడియో కెమెరాలతో ప్రవేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విధుల్లో ఉన్న ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులపై అరవింద్ దుర్భాషలు ఉపయోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పోలీసులపై అసభ్య, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, డ్యూటీలో ఉన్న సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 132, 223, 296(B)తో పాటు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 226 కింద క్రైమ్ నెం. 51/26గా కేసు నమోదు చేసినట్లు టౌన్-1 ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి చర్యలు చట్టపరంగా తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!