

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళా క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందిని కలసి ప్రపంచ కప్ విజయంపై అభినందించారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షలు, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో సత్కరించారు. అంధ మహిళా క్రికెటర్ల విజయం దేశానికి గర్వకారణమని ప్రశంసించిన ఆయన, వారి సాధనకు ప్రత్యేక సదుపాయాల కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రికెటర్లు వెల్లడించిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేస్తానని చెప్పారు. ప్రపంచ కప్ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపిక (కెప్టెన్), పాంగి కరుణ కుమారి ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీపిక తన గ్రామానికి రహదారి సౌకర్యం కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కరుణ కుమారి చేసిన అభ్యర్థనలపై కూడా తక్షణ చర్యలు ప్రారంభించాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!