

అమరావతి రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి దశలో 34 వేల ఎకరాలు సేకరించిన సీఆర్డీఏ, ఇప్పుడు మరో 16,666.56 ఎకరాలు సేకరించడానికి సిద్ధమైంది. దీంతో అమరావతి కోసం మొత్తం 50 వేల ఎకరాలకు పైగా రైతుల నుంచి భూములు పొందినట్లవుతుంది.
మొదటి విడతలో 28,526 మంది రైతుల నుంచి 34,400 ఎకరాలు తీసుకున్నారు. అదనంగా ప్రభుత్వం 16 వేల ఎకరాలు సీఆర్డీఏ కు అప్పగించింది. ఇలా మొత్తం 74 వేల ఎకరాల్లో రాజధాని నగర నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండో విడత భూసమీకరణ కోసం 7 గ్రామాల్లో భూములను తీసుకోనున్నారు. ఇందుకోసం సీఆర్డీఏ త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రైల్వే స్టేషన్, కొత్త రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కీలక మౌలిక సదుపాయాల కోసం ఈ భూసమీకరణ అవసరం ఉందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
మంత్రి వివరాలు ఇలా ఉన్నాయి:
రాజధాని విస్తరణ కోసం భూ సమీకరణ రెండో దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది
వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి ప్రాంతాల్లో 7,562 ఎకరాలు
వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ప్రాంతాల్లో 9,104.57 ఎకరాలు సమీకరించాలి
ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు, అయితే వాటిలో కొండలు, నీటి భాగాలు పని చేయదగినవి కావని చెప్పారు
మొదటి విడత రైతులకు ఇచ్చిన ప్లాట్ విధానాలు ఇప్పటికీ వర్తిస్తాయి
జరీబు భూమికి 1,000 గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం
మెట్టు భూములకు 1,000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం
కౌలు కూడా గత విధానం ప్రకారం ఇస్తారు
స్పోర్ట్స్ సిటీకి గతంలో 70 ఎకరాలు కేటాయించినా, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ కోసం 2,500 ఎకరాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు–నాన్ జరీబు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.
అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏబీఫ్ఐడీ నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!