

తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం పుదుక్కోట లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడులో కుటుంబ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రజాసంక్షేమాన్ని విస్మరించి వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ ను సీఎం చేయాలన్న ఆలోచనలు నెరవేరవని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో మహిళల భద్రతకు హామీ లేదని, శాంతిభద్రతలు లోపించాయని అమిత్ షా ఆరోపించారు. దీనికి ముందు తన పర్యటనలో భాగంగా తిరుచిరాపల్లి విమానాశ్రయం కు చేరుకున్న అమిత్ షాకు పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తో పాటు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ వ్యూహాలపై అమిత్ షా బీజేపీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!