

2027 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పార్టీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీ ఓట్లను 27 వేల మేర పెంచడంతో పాటు బీజేపీ ఓట్లను అదే స్థాయిలో తగ్గించేలా పనిచేయాలని సూచించారు. లఖ్నవూలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం సాంకేతికతను వినియోగించడంతో పాటు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలేశ్ విమర్శించారు. అలాగే ఉత్తర్ప్రదేశ్లో 72 జిల్లాల్లో 151 అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమైనట్లు తమ పార్టీ నమోదు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కేసుల్లో 14 అరెస్టులు మాత్రమే జరిగాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఎస్పీ అధికారంలోకి వస్తే వ్యవసాయం, వైద్యం, విద్య, నేర నియంత్రణ వంటి రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ), రిమోట్ సెన్సింగ్ వంటి సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తామని అఖిలేశ్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!