

బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ నటించిన ‘ది తాజ్ స్టోరీ’ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రాన్ని సురేష్ ఝూ నిర్మించగా, దర్శకుడు తుషార్ అమ్రిష్ గోయెల్ తెరకెక్కించారు. ఇందులో జాకీర్ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, స్నేహ వాఘ్, నమిత్ దాస్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్ 31 న థియేటర్లలో విడుదలై అప్పట్లోనే చర్చకు దారితీసింది. విడుదలైన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా లయన్స్‌గేట్ ప్లే(Lionsgate Play) ఓటీటీ వేదికలో ఈ నెల 13 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజ్ మహల్‌ను నిజంగా షాజహాన్ నిర్మించాడా లేదా దాని వెనుక మరో రహస్యం ఉందా అనే అంశాన్ని పరిశోధనల ఆధారంగా ఈ కథ రూపొందించారు. పోస్టర్ విడుదల సమయంలో కూడా పెద్ద వివాదం జరిగింది. తాజ్ మహల్ నుంచి శివుడి విగ్రహం బయటకు వస్తున్న దృశ్యంతో ఉన్న పోస్టర్ పెద్ద చర్చకు దారితీసింది.

సినిమాలో విష్ణు దాస్ అనే టూర్ గైడ్ తాజ్ మహల్ వెనుక దాగి ఉన్న నిజమైన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. చరిత్రకారుడు పి.ఎన్. ఓక్ చెప్పిన వివాదాస్పద సిద్ధాంతం ప్రకారం, తాజ్ మహల్ అసలు ఒక పురాతన శివాలయం “తేజో మహాలయ” అని, దాన్ని తరువాత షాజహాన్ సమాధిగా మార్చాడని కొందరు వాదిస్తారు. అయితే భారత పురాతత్వ శాఖ ఈ వాదనను ఖండించింది. ఈ అంశాన్ని సినిమా కథలో చూపించడంతో చరిత్రకారులు, న్యాయవాదులు కోర్టుల్లో కూడా ఈ విషయంపై చర్చకు తెరతీశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!