

ప్రతి మనిషికీ ఓ ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఆలోచనను ప్రేక్షకులకు కొత్తగా, ఆసక్తికరంగా చెప్పడంలోనే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అలాంటి విభిన్నమైన ప్రయత్నమే ‘డబుల్ ఆక్యుపెన్సీ’. సినిమా టైటిల్ నుంచే దర్శకుడు కథలోని ప్రధాన పాయింట్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. అశ్విన్ కందసామి రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటి ఖుష్బూ సుందర్ నిర్మించారు.
ఈ సినిమా కథ రజనీ చుట్టూ తిరుగుతుంది. పుట్టుకతో వచ్చిన ఓ అరుదైన లోపం కారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రజనీ ఆడపిల్లగా ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత అదే వ్యక్తి అబ్బాయిగా మారిపోతాడు. ఈ విషయం రజనీ పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రులకు తెలియడంతో ఎంతో జాగ్రత్తగా పెంచుతారు. అయితే పగటి రజనీకి రాత్రి రజనీ ఏం చేస్తున్నాడో తెలియదు. అలాగే రాత్రి రజనీకి పగటి రజనీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇద్దరినీ కలిపే ఏకైక బంధం వారు ఉపయోగించే మొబైల్ ఫోన్.
అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో పగటి సమయంలో రజనీ తల్లిదండ్రులు మరణిస్తారు. రాత్రి రజనీకి ఈ విషయం తెలిసిన తర్వాత, తల్లిదండ్రులను చివరిసారి చూసే అవకాశం కూడా తనకు దక్కలేదనే బాధతో పగటి రజనీపై ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.
క్లైమాక్స్‌కు ముందు కొందరు దుండగులు పగటి రజనీని ఓ కారణంతో కిడ్నాప్ చేస్తారు. అయితే వారు ఊహించినట్లుగా రజనీ రాత్రి రూపంలోకి మారడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఆసక్తికరమైన మలుపే ‘డబుల్ ఆక్యుపెన్సీ’ క్లైమాక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఇలాంటి కాన్సెప్ట్‌లు గతంలో అప్పుడప్పుడు కనిపించినప్పటికీ, దర్శకుడు అశ్విన్ కందసామి ఈ కథను కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్‌తో ఆసక్తికరంగా మలిచారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. వెరైటీ కథ, డబుల్ డోస్ కామెడీ, ఊహించని ట్విస్టులతో ‘డబుల్ ఆక్యుపెన్సీ’ మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!