

‘కేజీఎఫ్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ అగ్రకథానాయకుడు యశ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌ను మార్చిన ‘కేజీఎఫ్’తో పాటు సినిమా విజయానికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఒక సినిమా విజయం కేవలం నిర్మాతకో, హీరోకో మాత్రమే చెందదని, దాని వెనుక రచయితలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రధాన నటీనటులు సహా ఎంతోమంది కృషి ఉంటుందని యశ్ పేర్కొన్నారు.
‘కేజీఎఫ్’ తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన యశ్.. ప్రేక్షకుల తీర్పు ఎప్పుడూ సరైనదేనన్నారు. ఎవరు ఎంత గౌరవానికి అర్హులో ప్రేక్షకులకు బాగా తెలుసని చెప్పారు. ఎంతటి స్టార్ హీరో అయినా అతడి భవిష్యత్తును శుక్రవారం నిర్ణయిస్తుందని, సినిమా సరిగ్గా ఆడకపోతే పాన్ ఇండియా అనే గుర్తింపు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 2023లో ఓ సినిమా కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ ‘కేజీఎఫ్’కు ముందు యశ్‌ను ఎంతమందికి తెలుసని ప్రశ్నిస్తూ, భారీ స్థాయిలో నిర్మించడం వల్లే సినిమాకు అంతటి క్రేజ్ వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో యశ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!