

తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ – గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 550 మందికి పైగా ప్రముఖ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. మంగళవారం సచివాలయంలో వివిధ కమిటీల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 29న న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొనే కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో రోడ్‌షోలు నిర్వహించగా, ప్రధాన సదస్సుకు 1,500కి పైగా కంపెనీలు, సంస్థలను ఆహ్వానిస్తున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ రంగాలకు చెందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 100 కంపెనీలు, సంస్థలను రక్షా ఎక్స్‌పోకు ఆహ్వానిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రధాన వేదికను 25 విభాగాలుగా ఏర్పాటు చేసి, ప్లీనరీ సమావేశాలు, సెమినార్లు, చర్చలు, ఒప్పందాలపై సంతకాలు, ప్రదర్శనలను నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలనూ ఏర్పాటు చేయనున్నారు. దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు రవాణా, వసతి, సమావేశాల నిర్వహణతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రతి ప్రతినిధికి సమన్వయం కోసం ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించేలా చర్యలు తీసుకుంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!