

రామాయణ సినిమాలోని పాటలపై వస్తున్న విమర్శల గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ముఖ్యంగా ‘రావణ తాండవ్’, ‘రంగులు రంగులే’ పాటలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాటలను రూపొందించే సమయంలో ఎన్నో మార్పులు చేస్తామని, పదేపదే విని సంతృప్తి చెందిన తర్వాతే విడుదల చేస్తామని రెహమాన్ వివరించారు. సంగీత సృష్టిలో తాము చేసే కృషి పూర్తయ్యేసరికి ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకునే శక్తి కూడా మిగలదని అన్నారు. నిన్న విమర్శించిన కొందరే తర్వాత తమ అభిప్రాయాలను మార్చుకుని క్షమాపణలు చెబుతారని తన కుమారుడు తరచూ చెబుతుంటాడని పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం తన పనిని నిజాయతీగా చేయడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశారు.
ప్రేక్షకులు తన గత విజయవంతమైన పాటల తరహాలోనే కొత్త సంగీతాన్ని అందించాలని కోరుకుంటారని రెహమాన్ చెప్పారు. అయితే, ఒకే తరహా సంగీతానికి పరిమితం కావడం తనకు ఇష్టం లేదని, కొత్త ప్రయోగాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 5న విడుదల కానుంది. చిత్రంలోని పాటలపై కొనసాగుతున్న చర్చతో ఈ భారీ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!