

యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా టీజర్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలై తీవ్ర వివాదానికి దారితీసింది. టీజర్లో ఉన్న అభ్యంతరకరమైన, అశ్లీల దృశ్యాలపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.
ఈ విషయంపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే కంటెంట్‌కు తమ సర్టిఫికేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. థియేటర్లలో ప్రదర్శించే టీజర్లు, ట్రైలర్లకు మాత్రమే సీబీఎఫ్సీ అనుమతి అవసరమని తెలిపింది. ‘టాక్సిక్’ టీజర్ నేరుగా యూట్యూబ్‌లో విడుదల కావడంతో అది తమ పరిధిలోకి రాదని, సినిమాకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ తమకు అందలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
టీజర్లో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే దృశ్యాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉషామోహన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీజర్‌ను తొలగించాలని కూడా కోరారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయగా, అందుకు సీబీఎఫ్సీ స్పందించింది. గీతూ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్’ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!