

'అశోక వనంలో అర్జున కళ్యాణం' విడుదల సమయంలో ఎదురైన అనుభవాన్ని నటి రితిక నాయక్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్లలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో అప్పట్లో తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె వెల్లడించారు. చిత్రబృందం తన పాత్రను చివరి వరకు రహస్యంగా ఉంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదని, తనకు చాలా బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు. అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాత ఆ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన అర్థమైందని చెప్పారు.
విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం'లో రితిక నాయక్ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదే తనకు నటిగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్న రితిక, తర్వాత 'మిరాయ్' విజయంతో మరో మెట్టు ఎక్కారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన నటించిన 'కొరియన్ కనకరాజు' విడుదలకు సిద్ధంగా ఉంది. గతంలో బాధ కలిగించిన నిర్ణయమే చివరకు తన కెరీర్‌కు మేలు చేసిందనే భావన ఇప్పుడు తనలో ఉందని ఆమె చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!