

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భోగి’ చిత్రం నుంచి ‘అన్నయ్య పానంలో పూసిన పువ్వులు’ అనే భావోద్వేగ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రా అండ్ రస్టిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో శర్వానంద్ పూర్తిస్థాయి మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించిన సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన బాణీలు, గాయకుడు శ్రీకృష్ణ గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తన ఐదుగురు చెల్లెళ్లను ప్రాణంగా చూసుకునే బాధ్యతాయుతమైన అన్నయ్యగా శర్వానంద్ పాత్రను ఈ పాటలోని దృశ్యాలు ఆవిష్కరిస్తున్నాయి.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథకు కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను జోడించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తాజాగా విడుదలైన పాట అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమను, అనుబంధాన్ని హృద్యంగా చూపిస్తోంది. ‘భోగి’ నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!