

వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త హార్దిక్ జగ్డా రోజువారీ జీవనశైలి చర్చనీయాంశంగా మారింది. ప్రాక్సిమిటీ వర్క్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేస్తారు. నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడటం, ఈమెయిల్స్ తనిఖీ చేయడం వంటి పనులకు దూరంగా ఉంటారు. ఆ సమయాన్ని వ్యాయామం, కంపెనీ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల కోసం వినియోగిస్తారు. ఉదయం 7 గంటలు దాటిన తర్వాత తన సమయంపై నియంత్రణ తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. వ్యాపారవేత్తలు, క్రీడాకారుల జీవిత చరిత్రల నుంచి స్ఫూర్తి పొందిన ఆయన, ఇతర పనులు ప్రారంభమయ్యేలోపే ప్రశాంతంగా కీలక అంశాలపై దృష్టి పెట్టే అలవాటును ఏర్పరచుకున్నారు.
ఈ దినచర్య వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో తనకు సహాయపడిందని హార్దిక్ చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఒక ప్రాజెక్టు కోసం తక్కువ సమయంలో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించాల్సి వచ్చినప్పుడు, తన బృందంతో కలిసి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మార్చి 72 గంటల్లో నియామకాలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఉదయం ఆటంకాలు లేని సమయం లభించడం వల్ల స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారాల్లోనూ పబ్లిక్ స్పీకింగ్ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తారు. అయితే, తన పని విధానాన్ని ఉద్యోగులందరూ అనుసరించాలని ఆయన కోరుకోవడం లేదు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు రోజులు పనిచేసే 996 వర్క్ కల్చర్‌ను ఆయన వ్యతిరేకిస్తున్నారు. తన సంస్థలో ఉద్యోగులు తమ ఉత్పాదకతకు అనుగుణంగా పని వేళలను ఎంచుకోవచ్చని, రాత్రివేళల్లో పనిచేసేవారికీ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, బృంద సభ్యుల మధ్య రోజుకు ఐదు నుంచి ఆరు గంటల సమన్వయం ఉండాలని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!