

గుజరాత్‌లోని వడోదరలో టీమిండియా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు సంబంధించిన భూ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండల్జా ప్రాంతంలో ఆయన నివాసానికి సమీపంలో ఉన్న 978 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ స్థలం విలువను చదరపు మీటరుకు సుమారు రూ.2.10 లక్షల చొప్పున మొత్తం రూ.20.53 కోట్లుగా అంచనా వేశారు. అయితే, పఠాన్ చెల్లించాల్సిన తుది మొత్తాన్ని ఇంకా నిర్ణయించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించిన తర్వాత ఆ మొత్తాన్ని ఖరారు చేసి, ప్రతిపాదనను మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ముందు ఉంచుతామని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ్ బాబు తెలిపారు. కమిటీ ఆమోదం లభించిన తర్వాతే కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ వివాదం 2012లో ప్రారంభమైంది. తన బంగ్లా పక్కనే ఉన్న స్థలాన్ని కేటాయించాలని పఠాన్ అప్పట్లో వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరారు. తొలుత బహిరంగ వేలం లేకుండా 99 ఏళ్ల లీజుపై భూమిని కేటాయించే ప్రక్రియ చేపట్టినప్పటికీ, 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. 2024లో ఆ స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు ఆదేశించగా, పఠాన్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. 2025 ఆగస్టు 21న ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో, డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. 2026 జూన్ 8న జరిగిన విచారణలో చట్టబద్ధమైన కేటాయింపు, అవసరమైన చెల్లింపు లేకుండా ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమించారని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం అదే ఏడాది ఆగస్టు 31న పఠాన్ తన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నారు. తాజా ప్రభుత్వ ఆమోదంతో ఈ వ్యవహారం మరో దశకు చేరినప్పటికీ, తుది చెల్లింపు, స్టాండింగ్ కమిటీ ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!