

ప్రత్యూష మరణం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన. ఆమె తల్లి చేసిన దీర్ఘకాల పోరాటం ఫలితంగా 24 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నిందితులకు శిక్షలు విధించింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే, యువ నిర్మాత సత్యారెడ్డి ఎంతో ధైర్యంతో ‘ప్రత్యూష’ అనే పేరుతోనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఆ సమయంలో పెద్దల పిల్లలు ఈ కేసులో ఉన్నారని తెలిసినా, భయపడకుండా ముందుకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో భారీ తారాగణంతో చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో అంకుశం రామిరెడ్డి, తెలంగాణ శకుంతల, కాస్టమ్స్ కృష్ణ, ఏవీఎస్, రమ్యశ్రీ, ఐరన్ లెగ్ శాస్త్రి, కళ్ళు చిదంబరం, తిరుపతి ప్రకాష్ వంటి ప్రముఖులు నటించారు.
సినిమాకు మీడియా విస్తృత ప్రచారం ఇవ్వడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. అయితే భయంతో హీరోతో పాటు రచయితలు, గాయకులు అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. దీంతో సత్యారెడ్డి స్వయంగా హీరోగా, రచయితగా, గేయరచయితగా, గాయకుడిగా మారి సినిమాను పూర్తి చేశారు. సెన్సార్ సమస్యల కారణంగా 1100 అడుగుల ఫుటేజ్ తొలగించాల్సి వచ్చింది. తరువాత కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించి విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో విడుదల చేయడంతో సినిమా విజయం సాధించింది. విజయవాడలో సత్యారెడ్డికి అభిమానులు 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి ‘జనం స్టార్’ బిరుదు అందజేశారు.
ఆ తర్వాత ఆయన సామాజిక అంశాలపై సినిమాలు తీస్తూ ముందుకు సాగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గద్దర్‌తో కలిసి “ఉక్కు సత్యాగ్రహం” చిత్రం తీశారు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్లో “కింగ్ బుద్ధ” అనే అంతర్జాతీయ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 25 దేశాల్లో చిత్రీకరించి, 100కి పైగా భాషల్లో విడుదల చేయాలని యోచిస్తున్నారు. 24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో నిందితులకు శిక్ష పడటంతో సత్యారెడ్డి మరియు అప్పటి చిత్ర యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!