

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా కాసాండ్రా, తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికరమైన, మరచిపోలేని అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2012లో విడుదలైన తన తొలి తెలుగు చిత్రం శివ మనసులో శ్రుతి సమయంలో నటనతో పాటు సినిమా పరిశ్రమలోని నిబంధనల గురించి తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పారు. షూటింగ్ కోసం వారాల తరబడి పాఠశాలకు సెలవులు తీసుకోవాల్సి వచ్చేదని, తాను చదువులో వెనుకబడకుండా ఉండేందుకు తన తల్లి సెట్స్‌లోనే కూర్చొని నోట్స్ రాసేవారని రెజీనా గుర్తుచేసుకున్నారు.
అలాగే ఓసారి రేడియో మిర్చి ఇంటర్వ్యూకు సాధారణ సల్వార్, జీన్స్ ధరించి, జుట్టును కూడా సరిగ్గా ఆరబెట్టుకోకుండా వెళ్లిన విషయాన్ని రెజీనా నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. అక్కడ తీసిన ఫొటోలు వెబ్‌సైట్‌లో ప్రచురితమైనప్పుడు తాను చాలా డల్‌గా కనిపించానని తెలిపారు. ఆ తర్వాత నటిగా సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, ప్రత్యేకమైన వ్యక్తిగత ఇమేజ్‌ను నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని చెప్పారు. మంచి పాత్రలు రావాలన్నా, కెరీర్‌లో ఎదగాలన్నా సమాజంలో మంచి ఇమేజ్ ఉండటం కూడా ముఖ్యమని రెజీనా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!