

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఒక్క హాలీవుడ్ సినిమాకైనా దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని వెల్లడించారు. బ్రెజిల్‌లో జరుగుతున్న 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన.. తన తదుపరి చిత్రం ‘వారణాసి’, హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ల గురించి పలు విషయాలను పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ విజయం తర్వాత హాలీవుడ్ నుంచి తనకు అనేక ఆఫర్లు వచ్చాయని తెలిపారు. అక్కడి సినిమా నిర్మాణ విధానం, పని చేసే శైలి అద్భుతంగా ఉంటాయని, తాను ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, అప్పటికే ‘వారణాసి’ పనులు ప్రారంభం కావడంతో ఆ ఆఫర్లను వెంటనే అంగీకరించలేకపోయానని చెప్పారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలపై పనిచేయడం తనకు సాధ్యం కాదని, ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో ప్రాజెక్టుపై దృష్టి పెడతానని స్పష్టం చేశారు. ‘వారణాసి’ పూర్తయ్యాక హాలీవుడ్ అవకాశాల గురించి ఆలోచిస్తానని వెల్లడించారు.
మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి కీలక అప్‌డేట్ ఇచ్చారు. చిత్రీకరణ మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ఈ భారీ చిత్రానికి రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కంచి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!