

బిహార్‌లోని అరారియా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మోనూ మేతుర్‌బాలాకు తన తల్లే ప్రపంచం. కొంతకాలం క్రితం అతడి తల్లి లాల్తీ దేవీ గొంతులో చేపముల్లు ఇరుక్కోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మోనూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తల్లి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె ఆరోగ్యం కుదుటపడితే పరుగులు తీస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. తల్లి ఆరోగ్యం మెరుగుపడటంతో తన మొక్కును నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 15న పాట్నా నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తల్లి కోసం చేసిన ప్రార్థనను భక్తి, పట్టుదలతో కూడిన సుదీర్ఘ యాత్రగా మార్చుకున్నాడు.
ఇప్పటివరకు మోనూ సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి, పరుగులు తీస్తూనే ఆరు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు. రోజుకు దాదాపు 50 కిలోమీటర్లు పరుగెత్తుతున్న అతడికి మరో ఇద్దరు వ్యక్తులు తోడుగా ఉంటూ సహకరిస్తున్నారు. తన కోసం కొడుకు పడుతున్న తపనను చూసి తల్లి లాల్తీ దేవీ ఎంతో మురిసిపోతున్నారు. మోనూ తండ్రి మహేశ్ చౌహాన్ మాట్లాడుతూ, తన కుమారుడికి చిన్నప్పటి నుంచే భక్తి ఎక్కువని, అయితే ఇంతటి సాహసోపేతమైన యాత్ర చేపడతాడని ఊహించలేదని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా ఉండేందుకు మోనూ పానీ పురీలు విక్రయిస్తున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తండ్రికి కూడా సహాయం చేస్తున్నాడు. అతడి సోదరుడు సోనూ సైతం ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్‌పై ఆసక్తితో ఎనిమిదో తరగతి నుంచే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన మోనూకు అది ప్రస్తుత యాత్రలో ఎంతో ఉపయోగపడుతోంది. మొదట్లో తండ్రి తనకు చేతనైనంత ఆర్థిక సహాయం చేసినప్పటికీ, ప్రస్తుతం యాత్రకు అవసరమైన డబ్బును మోనూనే సమకూర్చుకుంటున్నాడు. మొత్తం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాతే ఇంటికి తిరిగి వెళ్లాలని అతడు నిశ్చయించుకున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!