

టాలీవుడ్‌లో మెగా అభిమానులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విజయాన్ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘‘చొక్కా నలగకుండా రూ.500 కోట్ల మార్కును అందుకోవడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం’’ అంటూ బన్నీ తలైవా స్టార్‌డమ్‌ను కొనియాడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వ్యాఖ్యల్లోని పదజాలంపై కొందరు మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య మరోసారి వాదోపవాదాలు మొదలయ్యాయి.
రజినీకాంత్‌ను ప్రశంసించే క్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని పరోక్షంగా తక్కువ చేసినట్లుగా ఉన్నాయని కొందరు మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బన్నీ ఉద్దేశం చిరంజీవిని అవమానించడం కాదని, రజినీకాంత్ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను ప్రశంసించడమేనని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. ఒక నటుడిని కొనియాడినంత మాత్రాన మరో నటుడిని తక్కువ చేసినట్లు భావించడం సరికాదని పేర్కొంటున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తర్వాత మెగా, అల్లు అభిమానుల మధ్య విభేదాలు మరింత బహిరంగంగా చర్చకు వచ్చాయి. అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో ఇరు వర్గాల అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ‘జైలర్ 2’పై బన్నీ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఎక్స్ వేదికగా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!