

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్ 1’ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ దామోదర్ నేరేళ్ల తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్ దువ్వూరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నేహా పఠాన్ కథానాయికగా కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ దామోదర్ నేరేళ్లకు చిన్నప్పటి నుంచే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉంది. గతంలో యూకే, అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన, తన సినీ కలను నిజం చేసుకునే దిశగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
దర్శకుడు శశాంక్ దువ్వూరు గతంలో రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘ఉల్టా’ అనే షార్ట్‌ఫిలింను కూడా రూపొందించారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే ఈ కథ పైకి వినోదభరితంగా కనిపించినప్పటికీ, ఇందులో బలమైన కాన్సెప్ట్ ఉంటుందని ఆయన తెలిపారు. రొమాంటిక్ అంశాలతో ప్రారంభమయ్యే కథ క్రమంగా సైన్స్ ఫిక్షన్ వైపు మలుపు తిరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం వెల్లడించింది. ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలతో పాటు విభిన్నమైన కథనం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని నిర్మాత డాక్టర్ దామోదర్ నేరేళ్ల ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమా టైటిల్ పోస్టర్‌తో పాటు ఇతర వివరాలను వెల్లడించనున్నారు. షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి, వచ్చే ఏడాది సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!