

సినీ రంగంలో రాజకీయ జోక్యం రోజు రోజుకు పెరిగిపోతోందని సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. 17వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ మరియు సాహిత్య ఉత్సవాల ప్రధాన ఉద్దేశం విభిన్న ఆలోచనలను పంచుకోవడమేనని, కానీ ఇటీవల అవి తమ దారిని తప్పుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఫెస్టివల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రకాశ్ రాజ్, పాలస్తీనా సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆ సినిమాలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, అదే తరహాలో కర్ణాటక ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 6 వరకు కొనసాగనున్న ఈ వేడుక ప్రారంభ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించే వారికీ, కర్ణాటక చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!