
హీరోయిన్ ఒక వితంతువు, పైగా ఒక బిడ్డకు తల్లి. అలాంటి మహిళను అమాయక స్వభావం కలిగిన హీరో వివాహం చేసుకునే కథతో సినిమా తెరకెక్కించడం అంటే దర్శకుడు, నిర్మాతలకు ఎంత నమ్మకం ఉండాలి అనేది ఆలోచించాల్సిన విషయం. అలాగే గ్లామర్‌కు ప్రాధాన్యం లేని ఇలాంటి పాత్రలను అంగీకరించడానికి నటీనటులకు కూడా ప్రత్యేక ధైర్యం అవసరం. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలిచిన చిత్రం ‘స్వాతిముత్యం’. 1986 మార్చి 13న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదట హీరో పాత్ర ఆధారంగా ఈ సినిమాకు ‘శివయ్య’ అనే టైటిల్‌ను పెట్టాలని అనుకున్నప్పటికీ చివరకు ‘స్వాతిముత్యం’గా ఖరారు చేశారు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ పురస్కారం అందుకోవడంతో పాటు మూడు నంది అవార్డులు (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు) సాధించింది. అలాగే ఆస్కార్‌కు ఎంట్రీ సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా కూడా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ సినిమా కథలో మొదట అమాయకుడైన హీరో సాధారణ వ్యక్తిగా మారేలా క్లైమాక్స్‌ను రూపొందించాలని అనుకున్నారు. అయితే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు దీనికి అంగీకరించలేదు. అదే విధంగా కథను సుఖాంతంగా ముగించాలనే ఆలోచన కూడా తొలుత ఉండగా, సుదీర్ఘ చర్చల అనంతరం ప్రేక్షకుల హృదయాలను కదిలించే విధంగా ముగింపు మార్చారు. సినిమాలో కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ కనిపించగా, రాధిక కొడుకుగా నటుడు కాంతారావు మనవడు కార్తీక్ నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రం 25 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదికిపైగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. 1986 జూన్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ వేడుకకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాల్గొన్న తొలి సినిమా వేడుక ఇదే కావడం విశేషం. ఆ వేడుకలో చిరంజీవి, బాలీవుడ్ దర్శకుడు-నటుడు రాజ్‌కపూర్ కూడా పాల్గొన్నారు.
ఈ చిత్రంలోని శివయ్య పాత్ర ప్రభావం అంతగా ఉండటంతో, 1994లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’లోని హీరో పాత్ర కూడా దీనిని పోలి ఉంటుందని కమల్ హాసన్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. ‘స్వాతిముత్యం’ను దర్శకుడు కె.విశ్వనాథ్ బాలీవుడ్‌లో ‘ఈశ్వర్’ పేరుతో రీమేక్ చేయగా, అందులో అనిల్ కపూర్ హీరోగా నటించగా విజయశాంతికి అది తొలి హిందీ చిత్రం అయ్యింది. కన్నడలో కూడా రాజేంద్ర బాబు దర్శకత్వంలో సుదీప్ హీరోగా ఈ కథను మళ్లీ తెరకెక్కించారు. సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగా కూడా విజయం సాధించడం కె.విశ్వనాథ్ ప్రతిభను మరోసారి చాటింది. విశ్వనాథ్-ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం నిజంగా ఒక ఆణిముత్యంగా నిలిచింది. ఇళయరాజా అందించిన ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’, ‘మనసు పలికే మౌనరాగం’, ‘లాలీ లాలీ’ వంటి పాటలు కూడా చిరస్థాయిగా నిలిచాయి. ప్రస్తుతం ఈ కల్ట్ క్లాసిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్‌నెక్స్ట్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!