

విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన శివాజీ, ‘దండోరా’లో తన పాత్ర పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపారు. మంచోడా, చెడ్డోడా అన్న సందేహం ప్రేక్షకుల్లో ఉంటుందన్నారు. వ్యవసాయదారుడిగా కనిపించే తన పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని, అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాకుండా, కమర్షియల్ అంశాలతో కూడిన భావోద్వేగాల మేళవింపని శివాజీ వెల్లడించారు. ‘కోర్ట్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయని, వాటికి తగ్గట్టుగానే తన పాత్ర ఉంటుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25 న భారీగా విడుదల కానుంది.
దండోరా తర్వాత శివాజీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో నటించనున్నారు. అదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎపిక్’ చిత్రంలో కూడా ఆయన కనిపించనుండగా, ఆ సినిమా కుటుంబ ప్రేక్షకులతో బలంగా అనుసంధానమయ్యే భావోద్వేగాత్మక చిత్రం అవుతుందని ఆయన తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!