

‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రానికి అన్ని తరాల ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుత స్పందన తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో, నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లతో మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
చిరంజీవి గారితో పని చేయడం మైండ్-బ్లోయింగ్ అనుభవమని అనిల్ రావిపూడి తెలిపారు. ఆయనను యంగ్, స్లీక్ లుక్‌లో చూపించడం తనకు ప్రత్యేకమైన సంతృప్తినిచ్చిందని, వింటేజ్ చిరంజీవిని మళ్లీ పెద్ద తెరపై చూడటం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని అన్నారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారి మధ్య ఉన్న సహజమైన స్నేహబంధం సినిమాకు ప్రధాన బలంగా మారిందని, వారి సన్నివేశాలు అన్ని వయసుల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పారు.
సినిమా విజయానికి బలమైన కథనం, కట్టుదిట్టమైన స్క్రీన్‌ప్లే, భీమ్స్ సంగీతం కీలక పాత్ర పోషించాయని దర్శకుడు పేర్కొన్నారు. ఇండియాతో పాటు అమెరికాలో కూడా వచ్చిన స్పందన తనను భావోద్వేగానికి గురి చేసిందన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూ సినిమా ఎంజాయ్ చేయడమే తనకు నిజమైన ఎనర్జీ అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంపూర్ణ వినోదాత్మక చిత్రాలు అందించాలని ఆశిస్తున్నానని అనిల్ రావిపూడి తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!