

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకధీరుడు S. S. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం వారణాసి. ఈ సినిమా ఇప్పటికే అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన భారీ ఈవెంట్లో ఈ చిత్ర టైటిల్‌తో పాటు విడుదల సంవత్సరం కూడా అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 26 సెకన్ల నిడివి గల ‘రామాయణం ఎపిసోడ్’ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ, 2027 లో సినిమా విడుదల ఖాయమని స్పష్టం చేశారు.
ఈ చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లింప్స్‌లో కనిపించే విజువల్స్, హై-స్పీడ్ స్లో మోషన్ షాట్స్ రాజమౌళి మార్క్ మేకింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
‘వారణాసి’ కేవలం అడ్వెంచర్ మూవీ మాత్రమే కాదు. ఇందులో టైమ్ ట్రావెల్, పురాణ గాథల మేళవింపు ఉంటుందని సమాచారం. మహేష్ బాబు ఇందులో ‘రుద్ర’ అనే శివ భక్తుడి పాత్రలో కనిపించనున్నారు. కథ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ, చివరికి వారణాసి పుణ్యక్షేత్రంలో కీలక మలుపు తిరుగుతుందని తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఫుటేజ్‌లో మహేష్ బాబు శ్రీరాముడి అవతారంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రేతాయుగం నాటి లంకానగరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ‘రామాయణం ఎపిసోడ్’ కోసం దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో 1.43:1 రేషియోలో తెరకెక్కిస్తున్న తొలి భారతీయ చిత్రంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి.
పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ బాబు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ గా మిస్టీరియస్ పాత్రలో నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
సుమారు రూ. 1,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం, 2027 ఏప్రిల్ 9 న శ్రీరామనవమి సందర్భంగా విడుదల కానుందని సమాచారం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం దాటే స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!