
2009 లో విడుదలైన ‘అవతార్’ ప్రపంచ సినీ ప్రేక్షకులను విస్మయానికి గురిచేసిన విజువల్ వండర్. దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన పాండోరా ప్రపంచం, నావి తెగ సంస్కృతి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2154 నేపథ్యంలో సాగిన కథలో, భూమి వనరులు క్షీణించడంతో మానవులు పాండోరాలోని విలువైన మినరల్స్ కోసం దండెత్తుతారు. ‘అవతార్’ ప్రోగ్రామ్ ద్వారా జేక్ సల్లి నావి తెగలోకి ప్రవేశించి, నటేరితో ప్రేమలో పడతాడు. చివరకు మానవుల దండయాత్రను ఎదుర్కొని పాండోరాను కాపాడే ప్రయత్నమే తొలి భాగం సారాంశం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.9 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.
2022 లో వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్‌లో జేక్ సల్లి ఒమిట్కయా తెగ నాయకుడిగా మారి, తన కుటుంబంతో జీవితం సాగిస్తాడు. మానవుల దాడితో కుటుంబాన్ని కాపాడేందుకు మెట్కయినా ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. సముద్ర జీవనశైలికి అలవాటు పడుతూ, కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ, బలమైన ఎమోషనల్ డ్రామా కొరవడడంతో తొలి భాగం స్థాయి స్పందన రాలేదు. అయినా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.3 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.
ఇప్పుడు మూడో భాగంగా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19 న విడుదలకు సిద్ధమవుతోంది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఈసారి కంటెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని జేమ్స్ కామెరూన్ చెబుతున్నారు. పునరావృతం లేకుండా కొత్త భావోద్వేగాలు, కొత్త అద్భుతాలు చూపిస్తామని హామీ ఇస్తున్నారు. మూడు గంటల 17 నిమిషాల భారీ రన్టైమ్తో వస్తున్న ఈ చిత్రం థియేటర్లలో మళ్లీ అవతార్ మ్యాజిక్‌ను సృష్టిస్తుందా? లేదా అన్నది విడుదల తర్వాత తేలనుంది.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!