

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. తాజాగా మహేశ్‌బాబు క్లీన్ షేవ్‌తో కనిపించిన కొత్త లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ‘వారణాసి’ కోసం పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించిన ఆయన, తాజాగా పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించడంతో ఈ లుక్ ఏ సన్నివేశం కోసం అన్నదానిపై చర్చ మొదలైంది.
మహేశ్‌బాబు కొత్త లుక్ సినిమాలోని పౌరాణిక నేపథ్య సన్నివేశాలకు సంబంధించినదేనా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ‘వారణాసి’లో ఆయన ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. యాక్షన్, అడ్వెంచర్‌తో పాటు పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!