

‘బలగం’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి ఇప్పుడు తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’తో మరోసారి వార్తల్లో నిలిచాడు. బలగం సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించగా, శిరీష్ సమర్పించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దిల్ రాజు వేణుకు మరో అవకాశం ఇచ్చాడు. అదే బ్యానర్లో వేణు తన రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ను ప్రారంభించాడు.
ఈ సినిమా కథ మొదట నాని దగ్గరకు వెళ్లింది. ఆయన కూడా ఒప్పుకున్నప్పటికీ, తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. నాని తప్పుకున్న తర్వాత ‘ఎల్లమ్మ’ సినిమా శర్వానంద్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి పలువురు హీరోల చేతులు మారుతూ వచ్చింది. చివరకు ఈ సినిమాలో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పేరు ఖరారైంది. ఎన్నాళ్ల నుంచో హీరోగా నటించాలనే కోరికతో ఉన్న దేవికి ‘ఎల్లమ్మ’ మంచి అవకాశంగా మారింది. అయితే ఇప్పటివరకు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
తాజాగా దర్శకుడు వేణు తన తదుపరి సినిమా అప్డేట్ను వెల్లడించాడు. ‘ఎల్లమ్మ’ గ్లింప్స్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తన తొలి సినిమా ‘బలగం’కు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన వేణు, ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నారు. అలాగే, బలగం లాగే తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’కూ ప్రేక్షకులు ఆదరించాలని కోరాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!