

సినిమా నిర్మాతలకు చాలా కాలంగా తలనొప్పిగా మారిన బుక్‌మైషో రేటింగ్స్, రివ్యూల వ్యవహారానికి తాజాగా కీలక మలుపు వచ్చింది. టికెట్ కొనకుండానే రివ్యూలు ఇవ్వగల అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ, బాట్స్, ఫేక్ అకౌంట్లతో సినిమాలకు కావాలని నెగెటివ్ లేదా పాజిటివ్ రేటింగ్స్ పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై పలుమార్లు నిర్మాతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా, నిర్మాత నాగ వంశీ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ రేటింగ్ మానిప్యులేషన్ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.
ఇప్పడు విడుదలకు సిద్ధమవుతున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు సంబంధించి ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లుగా కనిపిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు BookMyShow ఈ సినిమాకు రేటింగ్స్, రివ్యూలను పూర్తిగా నిలిపివేసింది. ఈ నిర్ణయంతో ఫేక్ అకౌంట్లు, బాట్స్ ద్వారా కావాలని రేటింగ్స్ ప్రభావితం చేసే అవకాశం ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వెనుక కొన్ని వారాల పాటు న్యాయపరమైన ప్రయత్నాలు జరిగాయని సమాచారం.
ఈ మార్పుకు సహకరించిన Ai Plex, Blocking Big సంస్థలకు నిర్మాతల సంస్థ Shine Screens కృతజ్ఞతలు తెలిపింది. గతంలో బుక్‌మైషో రేటింగ్స్‌ను యాంటీ ఫ్యాన్స్ సినిమాలపై దాడికి ఉపయోగించడమే కాకుండా, కొన్నిసార్లు సాధారణ సినిమాలకు అతిగా రేటింగ్స్ పెంచి ఓటీటీ, శాటిలైట్ డీల్స్‌పై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ పని టికెట్లు అమ్మడమే తప్ప సినిమాల భవితవ్యాన్ని నిర్ణయించడంకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా దారి చూపే ఉదాహరణగా మారుతుందనే చర్చ జరుగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!