

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రల పరిచయం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చివర్లో చూపించిన హనుమంతుడి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీనియర్ నటుడు సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించగా, ఆయన పాత్ర నేపథ్యంలో వినిపించిన హనుమాన్ చాలీసా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఈ చాలీసాను ప్రముఖ గాయకులు కైలాష్ ఖేర్, సుఖ్విందర్ సింగ్, శంకర్ మహదేవన్, దిల్జిత్ దొసాంజ్, మోహిత్ చౌహాన్ ఆలపించారు. ఈ సన్నివేశానికి మంచి స్పందన రావడంతో చిత్రబృందం తాజాగా హనుమంతుడి పాత్రకు సంబంధించిన ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది. దీంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే, తెలుగు ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన సర్‌ప్రైజ్ కూడా ఈ సినిమాలో ఉంది. రావణాసురుడి కుమారుడు మేఘనాథుడి పాత్రను ఎండ్ టైటిల్స్‌లో పరిచయం చేశారు. ఈ పాత్రలో నటించింది ‘ది ప్యారడైజ్’ ఫేమ్ రాఘవ్ జుయల్ కావడం విశేషం. నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో రాఘవ్ జుయల్ విక్రమ్ మాలిక్‌గా నటిస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు పోషిస్తున్న షికంజా మాలిక్ కుమారుడిగా ఆయన కనిపించనున్నారు. ఇప్పుడు ‘రామాయణ’లో మేఘనాథుడిగా పరిచయమైన రాఘవ్ జుయల్.. రెండో భాగంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!