

‘నవరసరాయ’ డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. యారో సినిమాస్ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో యువ నటుడు అఖిల్ రాజ్ సినిమా విశేషాలతో పాటు అనుపమ పరమేశ్వరన్తో కలిసి నటించిన అనుభవాన్ని పంచుకున్నారు.
తాను ఎప్పుడూ మంచి కథలో, మంచి సినిమాలో భాగం కావాలని కోరుకుంటానని, తన పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోనని అఖిల్ రాజ్ తెలిపారు. ఈ సినిమాలో తన పాత్రకు అవసరమైన ఎనర్జీ, నటనను అందించానని చెప్పారు. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో అనుపమ కథానాయికగా నటించినప్పుడు తాను చిన్న పాత్ర చేశానని, హీరో అయ్యాక ఆమెతో కలిసి నటించాలని తన తల్లి కోరుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆమెతో కలిసి నటించడం తనకు ఆనందంగా ఉందన్నారు. మొదట్లో అనుపమతో నటించడానికి కొంత భయపడినా, ఆమె అందించిన సహకారంతో కొద్దిసేపట్లోనే సౌకర్యంగా భావించానని చెప్పారు. ప్రతి సన్నివేశానికి ముందు ఇద్దరూ చర్చించుకుని, నటీనటులుగా కాకుండా పాత్రల దృష్టితో ఆలోచిస్తూ నటించామని అఖిల్ వివరించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!