

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల కస్టడీ విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించినందుకే వారిని తిహార్ జైలుకు తరలించారని ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకే తమ ఉద్యమమని స్పష్టం చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలనుకుంటే అధికారికంగా ప్రకటించాలని, అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, కేంద్రం తమ పార్టీ ఆందోళనలపైనే దృష్టి సారిస్తోందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ స్వతంత్ర ఉద్యమ సమూహమని, ఇండియా కూటమికి వ్యతిరేకం కాదని, రెండు వర్గాల లక్ష్యం ఒక్కటేనని పేర్కొన్నారు. మరోవైపు, దిల్లీలోని జంతర్మంతర్ వద్ద సోమవారం నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఇండియా కూటమి నేతలపై పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దిల్లీ నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమైన అభ్యంతరకర, తప్పుదోవ పట్టించే సుమారు 500 పోస్టులను తొలగించాలని అధికారులు సంబంధిత వేదికలను కోరినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!