

శరీరానికి సరైన విశ్రాంతి లేకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. మనం మేల్కొని ఉన్నా, మెదడు మాత్రం పాక్షికంగా నిద్రలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది. దీనివల్ల తల భారంగా అనిపించడం, ఏకాగ్రత కుదరకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలామంది దీన్ని సాధారణ అలసటగా భావించినా, నిద్రలేమి కారణంగా మెదడులోని కీలక భాగాలు తాత్కాలికంగా తమ పనితీరును తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి వల్ల మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం ప్రభావితమవుతుంది. ఇది జ్ఞాపకశక్తి, నిర్ణయాల సామర్థ్యానికి ముఖ్యమైన భాగం. నిద్ర లేకపోతే మెదడులో వ్యర్థాలు తొలగించే ప్రక్రియ సరిగా జరగదు. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి మెదడు మందగిస్తుంది. ఫలితంగా మనం దారి మర్చిపోవడం, స్పందించడంలో ఆలస్యం చేయడం, స్పష్టంగా ఆలోచించలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటాం.
ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మెదడు కణాలు బలహీనపడే ప్రమాదం ఉంది. ఏకాగ్రత తగ్గిపోవడంతో చిన్న పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పని చేసే సమయంలో స్పందన మందగించడం ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7–8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్రపోయే ముందు ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం చాలా ముఖ్యం.
మొత్తానికి నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు, అది మెదడుకు అవసరమైన మరమ్మత్తు ప్రక్రియ. సరైన నిద్రతోనే మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి పౌష్టికాహారంతో పాటు సమయానికి నిద్ర కూడా అత్యంత అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేయకుండా క్రమబద్ధంగా పాటిస్తేనే మనం ఉత్సాహంగా, ఏకాగ్రతతో జీవించగలం.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!