

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యలు సైలెంట్ కిల్లర్‌లా విస్తరిస్తున్నాయి. మెడ భాగంలో ఉన్న ఈ చిన్న గ్రంథి శరీర జీవక్రియను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అసమతుల్యంగా మారితే బరువు పెరగడం, జుట్టు రాలడం, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి సరైన ఆహారపు అలవాట్లు ఎంతో అవసరం. సోయా ఉత్పత్తులు థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అలాగే క్యాబేజీ, బ్రోకలీ, క్యాలిఫ్లవర్ వంటి కూరగాయలను పచ్చిగా తినడం మానుకుని ఉడికించి తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్, అధిక చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచి సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. అలాగే కాఫీ, టీలు, మద్యం వంటి కెఫీన్, ఆల్కహాల్ పదార్థాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. మరోవైపు అయోడిన్, సెలీనియం, జింక్, ప్రోటీన్ వంటి పోషకాలు థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. పాల ఉత్పత్తులు, చేపలు, బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు, గుడ్లు, పనీర్, శనగలు, తాజా పండ్లు, ఆకుకూరలు వంటి ఆహారాలను చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
కేవలం ఆహారం మాత్రమే కాదు, జీవనశైలిలో మార్పులు కూడా థైరాయిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చేయడం శరీరాన్ని చురుకుగా ఉంచి హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది. మెడిటేషన్ వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అదనంగా, ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి నియంత్రించుకోవచ్చు. ఈ విధంగా సరైన ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా థైరాయిడ్ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!